top of page
Writer's pictureWriter Desk

కేసీఆర్ కుదుటపడినట్లే!

బీఆర్ఎస్ కు గడ్డుకాలం ముగిసినట్లేనా!


సంక్షోభం నుండి బయటపడ్డట్లేనా!


కవితకు బెయిల్ రావడంతో బీఆర్ఎస్ లో కొత్త జోష్!


కేసీఆర్ కుదుటపడినట్లే అంటున్న పార్టీ శ్రేణులు


పదినెలల పాటు  ఇంటా బయటా సమస్యలే!


కవిత అరెస్ట్ తో విషాదంలో కుటుంబం!


వరుస ఓటములు కేసులతో ఉక్కిరి బిక్కిరి!


తీవ్ర మనోవేదనకు గురైన కేసీఆర్!


 


హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితికి గండాలు ముగిసినట్లేనా! ఉనికి కోసం పాకులాడే స్థాయిలో సంక్షోభ పరిస్థితిని ఎదురుకుంటున్న కేసీఆర్ పార్టీ అందులోనుండి బయటపడుతుందా! ప్రస్తుత పరిణామాలు అలానే  అనిపిస్తున్నాయి! అసెంబ్లీ ఎన్నికల ఓటమితో మొదలైన ప్రతికూల పరిస్థితి కవిత అరెస్ట్ తో  సంక్షోభ స్థాయికి పడిపోయింది. ఎన్నికలలో ఓటమి,  ఆ వెంటనే కేసీఆర్ ఫామ్ హౌస్ లో కాలు జారిపడి మూడు నెలలుగా మంచానికే పరిమితం కావడం, తర్వాత కవిత అరెస్ట్, ఆ తర్వాత వచ్చిన ఎంపీ ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయం పొందడం వంటి పరిణామాలు వరుసగా చోటుచేసుకున్నాయి. వరుస విషాదాలతో కేసీఆర్ తీవ్ర మనోవేధనకు గురయ్యారు. దాదాపు పదేళ్ల పాటు అధికార వైభవంతో రాచరిక జీవితాన్ని అనుభవించిన కేసీఆర్, అయన కుటుంబ సభ్యులకు ఓటమి తర్వాత పరిస్థితి అగాథంలో పడిపోయినట్లుగా కనిపించింది.  అయినవాళ్లు అనుకుని అందలమెక్కించిన వాళ్ళే పార్టీని వీడిపోవడంతో కేసీఆర్ షాక్ తిన్నారు. ఎమ్మెల్యేలు కూడా ఒకరొకరుగా అధికార పార్టీలోకి లైన్ కట్టడంతో పార్టీని, మిగిలిన  ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కూడా పెద్ద సవాలుగా మారింది! ఇక ఎంపీ ఎన్నికలలో ఒక్క సీటు కూడా గెలుచుకోలేక చతికిలపడటం కేసీఆర్ ను మరింత కలిచివేసింది. ప్రజలు ఎందుకు ఆధరించడం  లేదనే సంశయం ఆయనను కంటి మీద కునుకులేకుండా చేసింది.  అన్నిటికి మించి కవిత అరెస్ట్ కేసీఆర్ తో పాటు అయన కుటుంబ సభ్యులను తీవ్రంగా వేధనకు గురిచేసింది. కుటుంబం లోని ప్రతీ ఒక్కరూ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఓ వైపు పార్టీ,  మరో వైపు కుటుంబం నిర్వేదంలో పడిపోవడంతో వీటన్నిటినీ అధిగమించడం శక్తికి మించిన కార్యం లా కేసీఆర్ ను సతమతం చేసింది. ఇవన్నీ ఒక వైపు ఇలా ఉంటే అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ ను ముందుగా టార్గెట్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేసులు పెట్టి పలువురు పోలీస్ అధికారులను జైలుకు పంపించింది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుతో కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కూడా విచారణ కమిషన్ వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ ను ముద్దాయిగా నిలబెట్టేందుకు విశ్వప్రయత్నం చేస్తోంది.   అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో మరో దశాబ్దం పాటు తమకు తిరుగు ఉండదని, దేశవ్యాప్తంగా సొంతంగా విస్తరించి సత్తా చాటుతామని ఎంతో ఆత్మ విశ్వాసం కనబరిచిన కేసీఆర్...అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పూర్తిగా కుప్పకూలిపోయారు. ఓటమిని జీర్ణించుకోవడానికి ఆయనకు కొన్ని నెలల సమయం పట్టింది.



ఐదు నెలల నరక యాతన!


రాజకీయంగా ప్రతికూలతను, సంక్షోభ పరిస్థితులను ఎదురుకోవడం కేసీఆర్ కు కొత్తేమి కాదు. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ ను ప్రకటించి తెలంగాణ సాధన పోరాటంలో ముందుండి నడిపించిన కేసీఆర్ అనేక సార్లు పార్టీ ఎమ్మెల్యేల చేత మూకుమ్మడి రాజీనామాలు చేయించి ఎన్నికలు ఎదుర్కున్నారు. ఒక దశలో పార్టీ మెజారిటీ ఎమ్మెల్యేలు సీనియర్ నేతలు తిరుగుబాటు చేసి వేరుకుంపటి పెట్టుకునే ప్రయత్నం చేశారు. నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ పార్టీ ని ఉనికిలో లేకుండా చేయడానికి విశ్వప్రయత్నమే చేసింది. అయితే తెలంగాణ వాదులు నాడు కేసీఆర్ కు అండగా నిలిచారు. అయితే తాజా గా అయన ఎదురుకున్న సంక్షోభ పరిస్థితి వేరు. కేవలం పార్టీకే పరిమితం కాలేదు. సొంత కూతురు అరెస్ట్ వరకు వెళ్ళింది. కవితను టార్గెట్ చేసిన బీజేపీ అధిష్ఠానం ఢిల్లీ లిక్కర్ కేసు లు అరెస్ట్ చేయించి ఐదున్నర నెలలపాటు తీహార్ జైలు లో పెట్టించింది. ఇదే కేసులో ఢిల్లీ ముఖ్యమంతి, ఉప ముఖ్యమంత్రి కూడా అరెస్ట్ అయ్యారు. దేశవ్యాప్తంగా దుమారం రేపిన ఈ కేసులో కవితను అరెస్ట్ చేయడం కేసీఆర్ కుటుంబాన్ని అత్యంత తీవ్రంగా కలిచివేసింది. ఎంతో మందికి రాజకీయ రక్షణ ఇచ్చి కాపాడిన కేసీఆర్ సొంత కూతురును అరెస్ట్ నుండి కాపాడుకోవలేకపోవడం అందరినీ విస్మయ పరిచింది. ఈ పరిణామం తర్వాత దాదాపు ఐదున్నర నెలల పాటు ఒకవిధమైన


నరకయాతనను కేసీఆర్, అయన కుటుంబం అనుభవించింది. అటు రాజకీయ సంక్షోభ పరిస్థితి, ఇటు కేసులు ఆరోపణలు, ఇంకోవైపు కుమార్తె అరెస్ట్, పుండుమీద కారంలా ఎంపీ ఎన్నికలలో ఓటమి..కేసీఆర్ కోలుకోలేని దెబ్బతిన్నట్లుగా తయారయ్యారు. పార్టీ శ్రేణులను కాపాడుకోవడానికి తాను అగ్నిపర్వతంలా నిబ్బరంగా ఉన్నాను భవిష్యత్తు మనదే అంటూ ఉత్సాహ పరిచేలా మాట్లాడినప్పటికీ అయన మాటల్లో జీవం లేకపోవడంతో పార్టీ శ్రేణులు కూడా డీలా పడిపోయాయి. బడ్జెట్ సమావేశాల సమయంలో కేవలం ఒక్క పూట మాత్రమే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చివెళ్లడం అయన ఎంత మానసిక పరిస్థితికి అడ్డం పెట్టిందనే అభిప్రాయం వ్యక్తమైంది. అధికార కాంగ్రెస్ అయితే కేసీఆర్ పారిపోయాడు అంటూ ముప్పేట దాడిచేసింది. ఇంత దారుణమైన పరిస్థితుల మధ్య కవితకు బెయిల్ లభించడం అటు కేసీఆర్, ఇటు పార్టీకి కొత్త ఊపిరిలు పోసినట్లయింది.



కేసీఆర్ కుదుటపడినట్లే!


కవితకు బెయిల్ లభించడంతో ఇక కేసీఆర్ మానసికంగా కుదుటపడినట్లేనని, అయన మళ్ళీ మునుపటి కేసీఆర్ లా రాజకీయాల్లో దూకుడు ప్రదర్శించడం ఖాయమనే అభిప్రాయం పొలిటికల్ సర్కిల్స్ నుండి వ్యక్తమవుతోంది. ఆ మధ్య మహారాష్ట్రలో భారీ వర్షాల వళ్ళ గోదావరికి భారీగా వరదనీరువచ్చి చేరడంతో మేడిగడ్డ బరాజ్ పూర్తిగా నిండినట్లు కనిపించింది. అయితే భారీగా వరద వచ్చినప్పటికీ ప్రాజెక్ట్ కు ఏమీ కాకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మేడిగడ్డ పిల్లర్లు కాస్త కుంగినప్పటికీ మరమ్మత్తులు చేయడంతో సమస్య తీరిపోయింది, ఈ ఘటన తర్వాత కేసీఆర్ మీడియా తో మాట్లాడతారని అందరూ భావించారు. కానీ అయన పెద్దగా స్పందించలేదు. అన్నిటికీ మించి కవిత జైలు లో ఉండిపోవడమే ఆయనను ఎక్కువగా బాధించిందని, అందువల్లే అయన ఇన్నాళ్లు ఆంటీ ముట్టనట్లుగా వ్యవహరించారని, ఇకముంది అలా ఉండదని, వచ్చే బతుకమ్మ పండుగ నుండి అయన దూకుడు ఎలా ఉంటుందో చూడబోతున్నామని పార్టీ నేతలు చెబుతున్నారు! చూడాలి ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో !



12 views0 comments

Comments


bottom of page